న్యూఢిల్లీ: కర్ణాటకలోని బెలగావిలో ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెంపదెబ్బ కొట్టబోయిన ఏఎస్పీ ఎన్వీ బరామణి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తనను అవమానించిన కారణంగా తాను స్వచ్ఛంద పదవీ విరమణను కోరుకుంటున్నట్లు జూన్ 12న ప్రభుత్వానికి రాసిన లేఖలో బరామణి పేర్కొన్నారు.
బెలగావిలో ఏప్రిల్ 28న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నిరసన ర్యాలీలో ప్రసంగించే సమయంలో సీఎం సిద్ధరామయ్య తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఏఎస్పీ బరామణి ముఖ్యమంత్రి సమీపానికి వెళ్లగా చెంప మీద కొట్టబోయారు.