Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాజీనామా చేయాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఫేలవ ఫలితాలు వచ్చినందుకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎంగా వైదొలగాలని ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. ఈ సంగతి తెలిసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఫడ్నవీస్ కు ఫోన్ చేసి ప్రభుత్వంలో కొనసాగాలని కోరినట్లు సమాచారం.
శివసేన ఏక్నాథ్ షిండే వర్గం, అజిత్ పవార్ సారధ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గం, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన మహాయుతి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాలకు 41 బీజేపీ, శివసేన గెలుచుకున్నాయి. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 17 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) కలిసి 30 స్థానాల్లో గెలుపొందాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ఫడ్నవీస్ తన రాజీనామా ప్రకటన చేశారు. గురువారం సీఎం ఏక్నాథ్ షిండే నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా ఫడ్నవీస్ దిగువన కూర్చుండి పోయారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఫడ్నవీస్ ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఆదివారం ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణం చేసిన తర్వాత మాట్లాడదాం అని ఫడ్నవీస్‌కు అమిత్ షా నచ్చ చెప్పినట్లు సమాచారం.