బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలకమైన డీకే శివకుమార్ (DK Shivakumar) డిప్యూటీ సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య, మంత్రులుగా ప్రమాణం చేసిన వారితో కలిసి తొలి కేబినెట్ మీటింగ్ కోసం విధాన సౌధకు (Vidhan Soudha) చేరుకున్నారు. అయితే అందులోకి ప్రవేశించే ముందు డీకే శివకుమార్ తనదైన స్టైల్‌ను మరోసారి ప్రదర్శించారు. గౌరవ సూచికంగా ఒంగిన ఆయన తన తలను విధాన సౌధ మెట్లకు ఆనించి సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగే కర్ణాటక పరిపాలనా కేంద్రమైన ఆ భవనంలోకి వెళ్లే ముందు మీడియాకు విక్టరీ సింబల్ చూపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ తొలుత సిద్ధరామయ్యతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అనంతరం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో డాక్టర్ జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జర్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బీజెడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ ఉన్నారు.
VIDEO | Karnataka CM @siddaramaiah and Deputy CM@DKShivakumar reach Vidhan Soudha after taking the oath. DK Shivakumar bends his forehead and touches the steps before entering the state assembly as a sign of respect. #Karnataka pic.twitter.com/3n7aJldbtE
— Press Trust of India (@PTI_News) May 20, 2023