ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విపాసన ధ్యానం కోర్సుకు (Vipassana course) హాజరవుతున్నారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొంటారు. అయితే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 21 విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ధ్యానంపై వివాదం నెలకొన్నది. ఉద్దేశ పూర్వకంగానే ఈడీ నోటీసులు ఇచ్చిందని ముఖ్యమంత్రి ఇప్పటికే వ్యాఖ్యానించారు. తాజాగా ఆ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) స్పందించారు.
సీఎం కేజ్రీవాల్ విపాసన మెడిటేషన్ సెషన్‌కు హాజరు కావాలనేది ముందుగా నిర్ణయించిన కార్యక్రమమని చెప్పారు. షెడ్యూల్లో భాగంగా మంగళవారం నుంచి పదిరోజుల పాటు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఈడీ నోటీసులపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. త్వరలోనే ఈ విషయమై ఈడీకి సమాధానం ఇస్తామని వెల్లడించారు.
విపాసన మెడిటేషన్ అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. ఇందులో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోడానికి కోర్సు పూర్తయ్యేవరకు పదిరోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా ఉంటారు. అలాగే అభ్యాసన కేంద్రం నుంచి బయటకు రావడం అనేది ఉండదు. బయటివ్యక్తులకు ఇందులో ప్రవేశం ఉండదు. కాగా, కేజ్రీవాల్ చాలా కాలంగా విపాసన ధ్యాన సాధన చేస్తున్నారు. గతంలో బెంగళూరు, జైపూర్తోసహా అనేక ప్రాంతాల్లో ఆయన ధ్యానం సాధన చేశారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి 30 వరకు ధ్యానంలో ఉంటారు.