చండీఘఢ్ : పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని లక్ష్యంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తాను బాత్రూంలో ఉన్నా ప్రజలను కలుస్తానని పంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
బాత్రూంలో ప్రజలను కలిసే తొలి సీఎం చరిత్రలో ఆయన ఒక్కడేనని అన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర సర్కార్ సర్కస్‌గా మారిందని వ్యాఖ్యానించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు చన్నితో విభేదాలుండగా సీఎంకు సునీల్ జాఖడ్‌తో పడటం లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయారని, మంత్రివర్గ సమావేశాల్లోనే కీచులాడుకుంటున్నారని పేర్కొన్నారు.
పంజాబ్ సీఎం కనుసన్నల్లోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. ఈ దందాలో సీఎంకూ ముడుపులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వంలో చివరిరోజుల్లో అందినకాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ దండుకుంటున్నారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.