చండీఘర్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేశారు. డిన్నర్‌కు ఏర్పాటు చేసి ఫుడ్ మంచి రుచిగా ఉందని కేజ్రీవాల్ కితాబిచ్చారు. మీరు కూడా తమ ఇంటికి భోజనానికి రావాలని ఆటో డ్రైవర్ కుటుంబాన్ని కేజ్రీవాల్ ఆహ్వానించారు.
త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆటో డ్రైవర్లతో సోమవారం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆటో డ్రైవర్లు అడిగిన పలు ప్రశ్నలకు కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. నేను మీకు పెద్ద అభిమానిని అని చెప్పాడు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తారా? అని సీఎంను ఆటో వాలా అడిగాడు. ఈ ఆహ్వానం నా గుండెల్లో నుంచి వస్తుందని తెలిపాడు.
కేజ్రీవాల్ స్పందిస్తూ.. తప్పకుండా వస్తాను. ఇవాళ రాత్రికే వచ్చి డిన్నర్ చేస్తానని ఆటో వాలాకు సీఎం చెప్పారు. తనతో పాటు భగవంత్ మాన్, హర్పాల్ సింగ్‌ను కూడా తీసుకువస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనికి ఆటో వాలా కూడా అంగీకరించడంతో చప్పట్లు మార్మోగాయి.
ఇక మీటింగ్ నుంచి నేరుగా సదరు ఆటో వాలా ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ డిన్నర్ చేశారు. ఈ ఫోటోలను కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆటో వాలా దిలీప్ తివారి ఇంట్లో డిన్నర్ చేశాను. అతని కుటుంబం తనపై ఎంతో ప్రేమ కురిపించిందని పేర్కొన్నారు. భోజనం చాలా రుచిగా ఉందన్నారు. ఆటో వాలా కుటుంబాన్ని కూడా తన ఇంటికి ఆహ్వానించాను అని కేజ్రీవాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.