Arvind Kejriwal | న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఆ పార్టీ నేత, ముఖ్యమంత్రి ఆతిశీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, వికాస్పురిలో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు.
ఆప్‌ను, కేజ్రీవాల్‌ను ఎన్నికల్లో ఓడించలేమని బీజేపీకి తెలుసునని, అందుకే ఆ పార్టీ ఇటువంటి రోత రాజకీయాలకు పాల్పడుతున్నదని, ఆయనను హత్య చేయాలనుకుంటున్నదని మండిపడ్డారు. ఆప్ సీనియర్ నేతలు మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ తోసిపుచ్చారు.