న్యూఢిల్లీ, మే 18: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. పోలీసులకు తమ పూర్తి సహకారం అందిస్తామని బిభవ్ న్యాయవాది తెలిపారు.
మరోవైపు స్వాతి మలివాల్ ఆరోపణలు కట్టుకథేనని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఘటన రోజు నాడు వాస్తవాలు వెల్లడించే ఓ వీడియోను ఆప్ శనివారం ఎక్స్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో మహిళా రక్షణ సిబ్బంది స్వాతి మలివాల్ చేయి పట్టుకుని కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు పంపిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇంటి బయటివరకు ఆమె కూల్‌గానే వారితో నడుచుకుంటూ వచ్చారు. ఆమెకు దెబ్బలు తగిలినట్టు ఎక్కడా కనిపించ లేదు. ఇంటి మెయిన్ గేటు దాటిన తర్వాత సిబ్బంది నుంచి తన చేతులను విడిపించుకుని వారితో ఏదో అన్నారు.
అరెస్ట్ భయంతోనే ఇదంతా: ఆతిశీ
స్వాతి మలివాల్‌పై ఢిల్లీ మంత్రి ఆతీశీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వాతి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో తన కార్యాలయంలో జరిపిన అక్రమ నియామకాల కేసులో అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్నారని, అందుకే బీజేపీ బ్లాక్‌మెయిల్‌కు భయపడి కేజ్రీవాల్‌పై కుట్రలో భాగస్వాములయ్యారని ఆరోపించారు.
ఆ రోజు బిజీగా ఉన్న కారణంగా కేజ్రీవాల్ ఆమెను కలవలేదని, ఒక వేళ కలిసి ఉంటే ఈ రోజు బిభవ్ కుమార్‌పై చేసిన ఆరోపణలు కేజ్రీవాల్‌పై చేసి ఉండేవారని అన్నారు. మలివాల్‌పై బిభవ్ చేసిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఢిల్లీ పోలీసులను ఆమె ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలిస్తే బీజేపీ నేతలతో ఆమెకు ఉన్న సంబంధం బయటపడుతుందన్నారు.