ఇటానగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్కు భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారత వైమానిక దళానికి చెందిన కార్పోరల్ టాగే హైలియాంగ్ (IAF Corporal Tage Hailyang) తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి కొందరు పర్యాటకులను ఆయన రక్షించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల బుల్లెట్ల బారినపడి మరణించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తజాంగ్ గ్రామానికి హైలియాంగ్ పార్థీవదేహం గురువారం చేరుకున్నది. ఈ నేపథ్యంలో సీఎం పెమా ఖండూ, ఇతర మంత్రులు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి సందర్భంగా ఐఏఎఫ్ కార్పోరల్ హైలియాంగ్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను అరుణాచల్ సీఎం పెమా ఖండూ కొనియాడారు. ‘తన ప్రాణాలను పణంగా పెట్టి పర్యాటకులను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించుకోవడానికి వారికి సహాయం చేశాడు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో హైలియాంగ్ మరణించాడు. అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఆ క్లిష్టమైన క్షణంలో ఆయన చూపిన నిస్వార్థత, స్ఫూర్తిదాయకమైన ధైర్యం చరిత్రలో నిలుస్తుంది’ అని అన్నారు.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ చరిత్రలో హైలియాంగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం పెమా ఖండూ తెలిపారు. ఆయన త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. 2017 నుంచి భారత వైమానిక దళంలో అంకితభావంతో చేసిన సేవలకు గుర్తింపు, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకుగాను స్వగ్రామంలో ఆయన స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని తెలిపారు. హైలియాంగ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.