చెన్నై: తమిళనాడులోని గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ టియర్స్ కంటి చుక్కల మందును అమెరికా బ్యాన్ చేసింది. ఆ కంటి చుక్కల మందు వల్ల అమెరికాలో సుమారు 55 మంది వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందిపడినట్లు రుజువైంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన డ్రగ్ కంట్రోలర్ శాఖ.. శుక్రవారం రాత్రి గ్లోబల్ ఫార్మా కంపెనీలో తనిఖీలు చేపట్టింది. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కంపెనీ..ఇప్పటికే అమెరికా నుంచి ఆర్టిఫిషియల్ టియర్స్ కంటి చుక్కుల మందును రీకాల్ చేసింది. ఆ చుక్కల మందులో డ్రగ్ రెసిస్టాంట్ బ్యాక్టీరియా ఉండడం వల్లే.. 55 కేసులు నమోదు అయినట్లు అమెరికాకు చెందిన సీడీసీ తెలిపింది. ఆ చుక్కల మందు వేసుకున్న వారిలో కొందరు చూపును కోల్పోయారు. ఓ వ్యక్తి రక్తస్త్రావంతో మరణించాడు.
అమెరికాకు పంపిన కంటి చుక్కల మందు శ్యాంపిళ్లను సేకరించామని, ఆ మందు తయారీ కోసం వాడిన ముడిసరుకుల్ని కూడా సేకరించామని, ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్ట్‌ను అందజేసినట్లు తమిళనాడు డ్రగ్ కంట్రోలర్ శాఖ అధికారి డాక్టర్ పీవీ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం రాత్రి రెండు గంటల వరకు ఫార్మా కంపెనీలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. తక్షణమే కంటి చుక్కల మందు తయారీని నిలిపివేయాలని గ్లోబల్ ఫార్మా కంపెనీకి ఆదేశాలు జారీ చేసినట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్లోబల్ ఫార్మా ప్లాంట్‌కు ఆర్టిఫిషియల్ టియర్స్ తయారు చేసేందుకు లైసెన్సు ఉన్నట్లు ఆమె చెప్పారు.
ఆర్టిఫిషియల్ టియర్స్‌ను వాడడం ఆపివేయాలని అమెరికా ప్రజలకు గ్లోబల్ ఫార్మా కంపెనీ సూచన చేసింది. టియర్ డ్రాప్స్ తీసుకుని ఇబ్బందులు పడుతున్నవారు వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవాలని కోరింది. ఎజ్రికేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐ డ్రాప్‌లను టెస్టింగ్ చేస్తున్నట్లు అమెరికా సీడీసీ తెలిపింది. టియర్ డ్రాప్స్ కలుషితమైనట్లు రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఆర్టిఫిషియల్ టియర్స్ లూబ్రికాంట్ ఐ డ్రాప్స్ బాటిళ్లను రీకాల్ చేస్తున్నట్లు గ్లోబల్ ఫార్మా ప్రకటించింది.