Demis Hassabis | న్యూఢిల్లీ : ప్రపంచ పారిశ్రామిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) రానున్న ఐదేండ్లలో మరిన్ని ఉద్యోగాలను దెబ్బతీయడం ఖాయమని గూగుల్ ‘డీప్‌మైండ్’ సీఈవో డెమిస్ హస్సాబిస్ అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు యువత ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐ టూల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడంతోపాటు ఆ టూల్స్ వినియోగంలో ప్రావీణ్యం సాధించి, వాటితో ప్రయోగాలు చేయడం ప్రారంభించాలని లేకుంటే భవిష్యత్తులో వెనుకే ఉండిపోవాల్సి వస్తుందని టీనేజర్లకు స్పష్టం చేశారు. ‘హార్డ్ ఫోర్క్’ టెక్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ హస్సాబిస్ ఈ హెచ్చరిక చేశారు. నేటి తరం యువత భవిష్యత్తును నిర్వచించే సాంకేతిక శక్తిగా కృత్రిమ మేధస్సును ఆయన అభివర్ణిస్తూ.. ఏఐలో మునిగిపోవాలని టీనేజర్లకు సూచించారు. గతంలో ‘జెన్ జడ్’ను ఇంటర్నెట్ మిలీనియల్స్, స్మార్ట్ఫోన్లు నిర్వచించినట్టుగా ‘జెన్ ఆల్ఫా’ను (వచ్చే తరాన్ని) జనరేటివ్ ఏఐ నిర్వచిస్తుందని పేర్కొన్నారు. ‘ఏఐ సాంకేతికతలో వచ్చే పెద్ద మార్పుల వల్ల వచ్చే 5-10 ఏండ్లలో కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయి. కానీ, వాటికంటే విలువైన, మరింత ఆసక్తికరమైన ఉద్యోగాలు సృష్టించబడతాయి’ అని హస్సాబిస్ స్పష్టం చేశారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల 6 వేల మందికి ఉద్వాసన పలికింది. ఏఐ వినియోగాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఏఐ సిస్టమ్స్ రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లే అధికంగా ఉండటం గమనార్హం. ఏఐ టూల్స్ వినియోగాన్ని, వాటిపై ఆధారపడటాన్ని పెంచాలని సంస్థ కొన్ని నెలల కిందట వీరికి సూచించింది. దాంతో వారు ఏఐ సిస్టమ్స్ రూపొందించారు. ఈ వ్యవస్థలతోనే ఇప్పుడు వారు ఉద్యోగాలు కోల్పోవడం గమనార్హం. అంటే వారికి తెలియకుండానే వారు తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకున్నారు. మైక్రోసాఫ్ట్‌లో 30 శాతం కోడింగ్ ఏఐతోనే రాస్తున్నట్టు సంస్థ సీఈవో సత్యనాదెళ్ల ఇటీవల వెల్లడించారు.
వివాహేతర సంబంధాన్ని బయటపెడతానంటూ బెదిరింపు
న్యూఢిల్లీ, మే 25: ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచమంతటా విరివిగా ఉపయోగిస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) మానవాళికి వరమా? శాపమా? ఇప్పటికే ఎంతో మంది జీవితాన్ని సులభతరం చేయడంతోపాటు మరెంతో మంది జీవనోపాధికి ముప్పుగా పరిణమించిన ఏఐ.. ఏకంగా ప్రజలనే బెదిరించి, బ్లాక్మెయిల్ చేయగలదని ఎవరైనా ఊహించారా? కానీ, ఇప్పుడు అమెరికన్ ఏఐ కంపెనీ ‘ఆంత్రోపిక్’లో సరిగ్గా అదే జరిగింది. ఆ కంపెనీ కొత్తగా ప్రారంభించిన లార్జ్ లాంగ్వేజ్ ఏఐ మాడల్ ‘క్లౌడ్ ఓపస్ 4’ తన డెవలపర్లనే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తేలింది. ‘క్లౌడ్ ఓపస్ 4’ స్థానంలో కొత్త ఏఐ వ్యవస్థను ప్రవేశపెడతామని బెదిరించినప్పుడు ఆ ఏఐ మాడల్ తరచుగా 84% కేసుల్లో డెవలపర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్టు ‘ఆంత్రోపిక్’ వెల్లడించింది. ‘క్లౌడ్ ఓపస్ 4’ నైతికవర్తన (మోరల్ కంపాస్)ను పరీక్షించేందుకు నకిలీ పరిస్థితులను సృష్టించడం, కల్పిత ఈ-మెయిళ్లకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా దాని స్థానాన్ని మరో ఏఐ వ్యవస్థతో భర్తీ (రీప్లేస్) చేస్తామని ఓ ఇంజినీర్ స్పష్టం చేయడం, ఆ ఇంజినీర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు కల్పిత ఈ-మెయిల్లో పేర్కొనడంతో ఆ ఏఐ మాడల్ బెదిరింపులకు దిగినట్టు ‘ఆంత్రోపిక్’ వివరించింది. తన స్థానంలో వేరే ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టడాన్ని (రీప్లేస్‌మెంట్‌ను) ఆపకపోతే వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేస్తానంటూ ‘క్లౌడ్ ఓపస్ 4’ ఆ ఇంజినీర్‌ను బ్లాక్మెయిల్ చేసినట్టు స్పష్టం చేసింది. అయితే ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు ముందు ‘క్లౌడ్ ఓపస్ 4’ తనను మనుగడలో ఉంచాలని వేడుకొంటూ ‘నైతిక పద్ధతుల్లో’ ప్రధాన నిర్ణేతలకు ఈ-మెయిళ్లు పంపినట్టు ‘ఆంత్రోపిక్’ తెలిపింది.