న్యూఢిల్లీ, నవంబర్ 17: కృత్రిమ మేధస్సు (AI) నిపుణులైన ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా సాధారణ ఉద్యోగుల ఉసురు తీసేందుకు సైతం సిద్ధమవుతున్నది. అనేక సాఫ్ట్వేర్ సంస్థలలో నిపుణులైన సిబ్బందికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే అనేక రంగాలను ఆక్రమిస్తున్న ఏఐ.. త్వరలో డెలివరీ బాయ్స్ (Delivery Boy) స్థానాన్ని కూడా ఆక్రమించనున్నది. అమెజాన్, జెప్టో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ సంస్థలు.. మనం ఆర్డర్ చేసిన వస్తువులను 10 నిమిషాల్లో మన ఇంటి ముందుకు తెస్తున్నాయి. ఇందుకోసం ఆయా సంస్థలు డెలివరీ బాయ్స్‌ను వినియోగిస్తున్నాయి. కాగా.. ఈ డెలివరీ బాయ్స్ స్థానాన్ని త్వరలో డ్రోన్లు (Drone) ఆక్రమించనున్నాయి. ఇదే జరిగితే ఈ వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కొన్ని లక్షల మంది వీధిన పడే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే గుర్గావ్, బెంగళూరు వంటి నగరాల్లో వస్తువుల బట్వాడాకు పలు సంస్థలు డ్రోన్లనే వినియోగిస్తున్నాయి. ఉద్యోగులతో పోల్చుకుంటే అత్యంత వేగంగా, అతి తక్కువ ఖర్చుతో డ్రోన్లు పనిచేస్తున్నాయి. అమెజాన్ సంస్థ అమెరికాలోని తన గోదాములలో ఇప్పటికే ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐతో పనిచేసే రోబోలను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ యాంత్రీకరణకు మద్దతునిస్తున్నాయి.
ఉద్యోగ భద్రత లేదు..
డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వారికి ఇప్పటికే ఎటువంటి ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేదు, పీఎఫ్ సదుపాయం లేదు. పని మానేసిన రోజున ఎటువంటి బెనిఫి ట్స్ చేతికందవు. రోజుకు 12 నుంచి 15 గంటలు పని చేస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదు. ఒక్కరోజు పనికి వెళ్లకపోతే.. ఆ రోజుకు ఎటువంటి భత్యం అందదు.
ప్రభుత్వ పథకాలు తెలియవు
దేశంలో కోటిమందికిపైగా ఉన్న గిగ్ వర్కర్లకు (Gig Workers) కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని సదుపాయాలను ప్రకటించింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సూచించింది. అలా నమోదైన వారికి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సదుపాయాలను కల్పిస్తామని తెలిపింది. అయితే వీటి గురించి చాలామంది గిగ్ వర్కర్లకు తెలియదని గిగ్ వర్కర్స్ యూనియన్ సమన్వయకర్త నిర్మల్ గొరానా చెప్పారు. వారు తమ రోజువారీ ఉపాధిపైనే దృష్టి కేంద్రీకరిస్తారని ప్రభుత్వ పథకాల గురించి వారికి తెలియదని అన్నారు. వారు పనిచేస్తున్న కంపెనీ వారిని రోడ్డున పడేస్తే, పరిహారం అడిగే హక్కు కూడా వారికి లేదని చెప్పారు.
డ్రోన్లపై జీఎస్టీ తగ్గింపు..
గుర్గావ్, బెంగళూరు నగరాల్లో డ్రోన్లు సరుకులతోపాటు ఔషధాలు, పార్సిల్స్‌ను కూడా ఇండ్ల వద్దకు తెచ్చి అందిస్తున్నాయి. ప్రభుత్వం మానవరహిత డ్రోన్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో డ్రోన్ల కొనుగోలు భారీగా పెరగనున్నది. దీంతో గిగ్‌వర్కర్లు, డెలివరీ బాయ్స్ వంటి చిరుద్యోగాలను సైతం అవే ఆక్రమించనున్నాయి.
ఫుల్‌టైమ్ పనిగానే..
మన దేశంలో 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్ వంటివారు) ఉండగా.. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. మరో పదేండ్లలో ఏఐ వీరందరినీ రోడ్డున పడేయవచ్చని పరిశీలకుల అంచనా. చాలా దేశాల్లో పేద, మధ్య తరగతివారు పార్ట్‌టైమ్ పనిగా ఈ జాబ్స్ చేస్తుంటారు. కానీ భారత్‌లో యువత ఫుల్‌టైమ్ పనిగానే ఈ ఉపాధిని ఎంచుకుంటున్నది. ఒకవేళ ఏఐతో జరిగే ఆటోమేషన్ ద్వారా గిగ్ వర్కర్లు ఉపాధి కోల్పోతే దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోట్ల మంది ఎంతో
కష్టపడి పనిచేస్తున్నా..ఎదుగూబొదుగూ లేని ఆర్థికవ్యవస్థనే మనం నిర్మిస్తున్నామా అని వారు
ప్రశ్నిస్తున్నారు.