కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్(Sheikh Shahjahan)పై ఆరేళ్ల నిషేధం విధించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెల్లవారుజామున షాజహాన్‌ను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. టీఎంసీ పార్టీ నేత డెరిక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నుంచి షేక్ షాజహాన్‌ను ఆరేళ్లు సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరును ఆయన తప్పుపట్టారు. బ్రిజ్ భూషణ్ లాంటి నాయకులపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ నేత ఒబ్రెయిన్ డిమాండ్ చేశారు.
ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖాలోని ఓ ఇంట్లో ఉంటున్న షాజహాన్‌ను గురువారం ఉదయం 3 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అనంతరం బసిర్హత్ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 5న రేషన్ పంపిణీ కుంభకోణంపై విచారణకు సంబంధించిన షాజహాన్ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై సుమారు వెయ్యి మంది దాడికి పాల్పడ్డారు. అప్పటినుంచి ఆయన కనిపించకుండా పోయారు.
దాదాపు 55 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న షాజాహాన్‌ను పోలీసులు ఇవాళ పట్టుకున్నారు. కాగా, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈడీ, సీబీసై సైతం ఆయనను అరెస్టు చేయొచ్చని కోల్కత్తా హైకోర్టు బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.