కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ కేసుపై గురువారం అక్కడి హైకోర్టులో విచారణ జరుగనున్నది. అయితే ఆయన తరుఫు వాదిస్తున్న న్యాయవాది అస్వస్థత చెందారు. (lawyer hospitalised) అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చిన్మయ్ దాస్ కేసు విచారణపై సందిగ్ధత నెలకొన్నది. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం అరెస్ట్ చేసిన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ తరుఫున 88 ఏళ్ల లాయర్ రవీంద్రనాథ్ ఘోష్ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల హక్కుల కోసం కూడా ఆయన పోరాడుతున్నారు.
కాగా, న్యాయవాది రవీంద్రనాథ్ ఘోష్ డిసెంబర్ రెండో వారంలో భారత్‌కు వచ్చారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాక్‌పూర్‌లో తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ మంగళవారం ఆయనను కలిశారు. ఆ తర్వాత న్యాయవాది రవీంద్రనాథ్ ఘోష్ తన కుమారుడి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే ఛాతిలో నొప్పి రావడంతో కోల్‌కతాలోని సేథ్ సుఖ్లాల్ కర్నానీ మెమోరియల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో అరెస్టైన చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్‌ను చిట్టగాంగ్ హైకోర్టు నిరాకరించింది. జనవరి 2 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. గురువారం రిమాండ్ గడువు ముగియనుండగా చిన్మయ్ కృష్ణ దాస్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే ఆయన అక్రమ అరెస్ట్ కేసును వాదిస్తున్న న్యాయవాది రవీంద్రనాథ్ ఘోష్ అస్వస్థతకు గురై కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయ్ దాస్ కేసు విచారణ కోసం బంగ్లాదేశ్‌లోని హైకోర్టుకు ఆయన హాజరయ్యే పరిస్థితిలో లేనట్లు తెలుస్తున్నది.