Morbi tragedy | గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన 3 నెలల తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వంతెన రెనోవేషన్ పనులను చేపట్టిన సంస్థ యజమానికి పోలీసులు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. మోర్బీ వంతెన కూలిపోయిన నాటి నుంచి సదరు సంస్థ యజమాని పరారీలో ఉన్నాడు. పోలీసులు ఆయన పేరును ప్రధాన నిందితుడిగా చార్జిషీట్లో చేర్చారు. ఒక్కసారిగా ఈ వంతెన కుప్పకూలిన ఘటనలో 135 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మోర్బీ వంతెన కూలిపోయి చాలా మంది చనిపోవడంతో పోలీసులు అయనకు సోమవారం నాడు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. మోర్బీ వంతెన కూలిన ఘటనలో దీని పునర్నిర్మాణ పనులు చేపట్టిన ఒరేవా గ్రూప్ ప్రమోటర్, అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జయసుఖ్ పటేల్‌ను మొదటి ముద్దాయిగా చేర్చారు. జయసుఖ్ పటేల్ పేరును చార్జిషీట్లో నమోదు చేసినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆయన ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దాంతో ఆయన అరెస్ట్‌కు వారంట్ జారీ చేయాల్సి వచ్చింది.
అజంతా బ్రాండ్‌తో గోడ గడియారాలను తయారు చేయడంలో పేరుగాంచిన ఒరేవా గ్రూప్ సంస్థ మచ్చు నదిపై 100 ఏండ్ల క్రితం నాటి సస్పెన్షన్ వంతెన పునరుద్ధరణ, నిర్వహణ కాంట్రాక్ట్‌ను పొందింది. ఈ వంతెనను తిరిగి తెరిచిన 4 రోజులకే అక్టోబర్ 30న కుప్పకూలింది. ఈ దుర్ఘటనపై గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. తమకు కావాల్సిన వ్యక్తి కావడం వల్లనే జయసుఖ్ పటేల్‌ను రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపించాయి. సరైన రీతిలో పునర్నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్లనే వంతెన కూలిపోయిందని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తన నివేదికలో పేర్కొన్నది. వంతనను తెరవడానికి ముందు దాని సామర్ధ్యాన్ని అంచనా వేయడంలో ఒరేవా గ్రూపు ఎలాంటి నిపుణుల ఏజెన్సీని నియమించలేదని స్పష్టం చేసింది.