Arrest : అనిల్ కుమార్ తివారీ (Anil Kumar Tiwari) అనే 58 ఏళ్ల వ్యక్తి గతంలో ఆర్మీలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. 36 ఏళ్ల క్రితం అంటే 1989లో అతను ఢిల్లీలో తన భార్యను హత్య చేసి, కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రికీరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతనే హత్యకు పాల్పడినట్లు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దాంతో కోర్టు 1989లోనే అనిల్ కుమార్ తివారీకి యావజ్జీవ కారాగార శిక్ష (Life sentence) విధించింది.
అయితే 2005లో రెండు వారాల పెరోల్‌పై బయటికి వచ్చిన తివారీ తిరిగి జైల్లో లొంగిపోకుండా పరారయ్యాడు. అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు. పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం మొబైల్ ఫోన్ వాడకుండా, ఆన్లైన్ ట్రాన్సక్షన్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. తరచూ ఇళ్లు మారుతూ, ఉద్యోగాలు మారుతూ 20 ఏళ్లు గడిపాడు. ఈ 20 ఏళ్లు పోలీసుల కళ్లుగప్పి తిరిగిన అతను నలుగురు పిల్లలకు తండ్రయ్యాడు.
ఇక పోలీసులు తన కేసు గురించి మర్చిపోయారేమో అని భావించిన అనిల్‌కుమార్ తివారీ కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తివారీ మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామమైన సిధికి వచ్చాడని తెలుసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి వెళ్లి ఈ నెల 12న అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.