న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఉపాధి హామీ పథకం కింద 2020-21లో 39 శాతం మందికి ఒక్క రోజు కూడా పని దొరకలేదు. 36 శాతం మందికి 15 రోజుల చొప్పున మాత్రమే పని దక్కింది. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నేతృత్వంలోని బృందాలు నాలుగు రాష్ర్టాల్లోని 8 బ్లాక్‌లలో నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ర్టాల్లో ఉపాధి హామీ కార్డు ఉన్న 2 వేల కుటుంబాలను సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం.. నాలుగు రాష్ర్టాల్లో కలిపి కూలీలకు సగటున 64 రోజుల ఉపాధి పని (వాస్తవానికి సగటున 77 రోజుల పని కల్పించాలి) మాత్రమే కల్పించారు. దీని వల్ల కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో బ్లాక్‌లో ఒక్కో కూలీ 20-80 శాతం ఆదాయాన్ని కోల్పోయారు.