న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఢిల్లీలో మురికివాడల ధ్వంసంతో వందలాది కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. చుట్టుపక్కల ఇండ్లల్లో పనిమనిషిగా జీవనం సాగిస్తున్న అనేకమంది మహిళలు ఉపాధి కోల్పోయి ఆవేదనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం జాంగ్పురాలో 60 ఏండ్లుగా ఉంటున్న మద్రాసీ క్యాంప్‌ను అధికారులు ఖాళీ చేయించారు. బాధిత కుటుంబాలను నగరం శివారు ప్రాంతంలోని నరేలాకు తరలించారు. మురికివాడలోని 370 ఇండ్లను బుల్డోజర్లతో అధికారులు కూల్చివేశారు. ఇందులో 215 కుటుంబాలకు సుదూరంలోని నరేలాలో ఫ్లాట్స్ కేటాయించారు. మిగిలిన 155 కుటుంబాలకు పునరావాసం దక్కలేదు. దీంతో వీరి భవిష్యత్తు, ఉపాధి అగమ్యగోచరంగా తయారైంది. దక్షిణ ఢిల్లీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరేలా ఫ్లాట్స్ నుంచి రాకపోకలు సాగిస్తూ, జాంగ్‌పురా చుట్టుపక్కల పనిచేయటం సాధ్యం కాదని పలువురు మహిళలు వాపోతున్నారు. పనికి ఎందుకు రావటం లేదంటూ యజమానుల నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ బాధిత మహిళలు ఆవేదన చెందుతున్నారు.