కిన్నౌర్: హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుతో పాటు ఓ ట్రక్కు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఆ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో పది మందిని రక్షించారు. అయితే ఐటీబీపీకి చెందిన మూడు బెటాలియన్లు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. సుమారు 200 మంది జవాన్లు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రదేశంలో ఇంకా కొన్ని కొండరాళ్లు పడుతున్నట్లు గుర్తించారు. సుమారు 40 మంది కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉన్నట్లు ఐటీబీపీ ప్రతినిధి వివేక్ పాండే తె లిపారు. ఐటీబీపీలోని 17వ, 19వ, 43వ బెటాలియన్ జవాన్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. రెక్కాంగ్ పీయో- షిమ్లా హైవేపై పడ్డ కొండచరియలను తొలగించేందుకు ఐటీబీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.