న్యూయార్క్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండటంతో యుద్ధానికి వ్యతిరేకంగా పలువురు సెలబ్రిటీలు గొంతువిప్పుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 65 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఉక్రెయిన్‌లో నిత్యం దాడులతో పౌరులు భీతిల్లుతున్న పరిస్ధితుల్లో యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను కోరుతూ హాలీవుడ్ లెజెండ్ ఆర్నల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ట్వీట్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
తొమ్మది నిమిషాల వ్యవధి కలిగిన ఈ వీడియోలో ఆయన యుద్ధం ఆపాలని నేరుగా పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. తాను చెప్పేది శ్రద్ధగా వినాలని వీడియో ఆరంభంలో ష్వార్జ్‌నెగ్గర్ రష్యన్లను కోరారు. ప్రపంచంలో జరిగే విషయాలు మీకు తెలియకుండా దాస్తున్నారని..ఈ భయానక విషయాలను మీరు తెలుసుకోవాలని అన్నారు. తన చిన్నతనంలో రష్యన్ హెవీవెయిట్ లిఫ్టర్ యూరీ వ్లాసోవ్ తనకు ఎలా స్ఫూర్తిగా నిలిచారో ఈ వీడియోలో టెర్మినేటర్ స్టార్ చెప్పుకొచ్చారు.
రష్యన్ల బలం, వారి సహృదయం తనకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అందుకే తాను ఉక్రెయిన్ వార్‌లో జరుగుతున్న విషయాలను రష్యన్లు తెలుసకోవాలని కోరుతున్నానని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో 141 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయని గుర్తుచేశారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను ఉద్దేశించి ప్రెసిడెంట్ పుతిన్ మీరు ఈ యుద్ధాన్ని ప్రారంభించి యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు..మీరే ఈ యుద్ధాన్ని ఆపగలరని అన్నారు.