జమ్మూ కశ్మీర్‌లోని ఆర్మీ పీఆర్వో ఒకరు ఇఫ్తార్ విందు ఇచ్చారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వున్న ఈ పీఆర్వో అధికారి ఇఫ్తార్ విందు ఫొటోలను రక్షణ శాఖ ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశారు. ఈ పోస్టును చూసి, సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పీఆర్వీ వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేశారు.
సెక్యులరిజం సంప్రదాయాలను గౌరవిస్తూ… దోడా జిల్లాలోని అర్నోరాలో ఇఫ్తార్ పార్టీని ఇచ్చాం అంటూ ఆ పీఆర్వో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పోస్టును వెంటనే తొలగించారు. అయితే ఈ ట్వీట్ తొలగింపుపై రక్షణ శాఖ వర్గాలు ఎలాంటి స్పందనా ఇవ్వడం లేదు.
అయితే ఈ పోస్టుపై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ”దశాబ్దాలుగా ఉగ్రదాడులు జరుగుతున్న జమ్మూ కశ్మీర్లో ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. అక్కడి సాధారణ పౌరుల మనసులను గెలుచుకునేందుకు ఇదొక విధానంగా అవలంబిస్తున్నాం. ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడం తప్పు.” అంటూ పేర్కొన్నారు.