ఈ మధ్యకాలంలో కొందరు ‘కూలీ’ అనే పదాన్ని అవమానించేలా వాడుతున్నారు. వాళ్లేదో తక్కువ అనే అర్థం వచ్చేలా రాతలు రాస్తున్నారు. హేళన చేస్తున్నారు. కానీ.. కూలీలు అంటే పనికిమాలిన వాళ్లు కాదు. వాళ్లు అభివృద్ధి నిర్మాతలు. ఇక.. తెలంగాణ కోసం పనిచేస్తున్న వారిని కూలీలు అంటూ ఒకరు సంభోదించారు. ‘ఆ వ్యక్తికే చెప్తున్నాం.. ఔను మేం కూలీలమే. కానీ ఆ వ్యక్తి అనుకుంటున్నట్టు.. వారి లాంటి కూలీలం కాదు. కూలీ అంటే నిర్మించేవాడు.. బరువు మోసేవాడు. ఎండనక.. వాననక కష్టపడి మనకోసం సౌకర్యాలను సిద్ధం చేసేవాడు. మనం నివసించడానికి భవనాలను నిర్మించేవాడు. ముండ్ల కంపలో రాళ్లు, రప్పల్లో నడిచి.. ప్రజల కోసం నున్నటి రోడ్లను తయారుచేసేవాడు’.
అసలు కూలీ అనే వాడు లేకపోతే ఈ సమాజమే లేదు. మనం ఉంటున్న ఇండ్లు, నడుస్తున్న రోడ్లు.. మనకు నీటిని అందిస్తున్న ప్రాజెక్టులు..నదులపై ఉన్న వంతెనలు..ఇలా చెప్పుకొంటూ పోతే..అసలు కూలీ లేకపోతే..ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం కూడా లేదు. రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడిన వారంతా కూలీలే. వారంతా రాష్ట్ర నిర్మాతలే. వారు చెమటోడిస్తేనే నేడు రాష్ట్రం నిలబడింది. ‘అలాంటి వారిని డబ్బులు తీసుకుని పనిచేసే కూలీలు అంటున్నాడు.. ఆ వ్యక్తి. అవును నిజమే. కానీ..అది పాలక వర్గాల నుంచి నగదు రూపంలోనో, కాంట్రాక్టుల రూపంలోనో, టెండర్ల రూపంలోనో, పదవుల రూపంలోనో కాదు. మా పేమెంట్ భిన్నంగా ఉంటుంది. అది బ్యాంకు అకౌంట్లలోకి బదిలీ చేసేది కాదు. ఆ పేమెంట్ గుండెల్లో చిరకాలం నిలిచిపోయేది’.
ఎండిన బీడులకు నీరు చేరిన సంతృప్తే మాకు పేమెంట్. రైతు భయం, బెరుకు లేకుండా నిద్రిస్తున్నాడన్న ఆనందమే మాకు పేమెంట్. దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే అగ్రభాగాన తెలంగాణ నిలబడిందన్న సంతోషమే మాకు పేమెంట్. తెలంగాణకు ప్రత్యేక గౌరవం దక్కడమే మాకు పేమెంట్. కొందరు పదవుల కోసం, పైసల కోసం, భూముల కోసం, అపాయింట్మెంట్లు తీసుకుని లాబీయింగ్‌లు చేసుకోవడానికి, వ్యక్తిగత లాభం కోసం పనిచేస్తారు. కానీ, మేము రాష్ట్రం కోసం..అభివృద్ధి కోసం..రాష్ట్ర భవిష్యత్ కోసం..ఆత్మగౌరవ తెలంగాణ కోసం పనిచేస్తాం. డబ్బులకు పనిచేసే వారికి..రాష్ట్రం కోసం త్రికరణ శుద్ధితో పనిచేవారికి ఉన్న తేడా ఇది.
‘నీలాగా ఏసీ స్టూడియోలతో, భారీ భవంతులతో తెలంగాణ నిర్మాణం జరగలేదు’. ఇక్కడి బిడ్డలు కులమతాలకు అతీతంగా కదిలి..కష్టపడితే వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇది. కేవలం అరవడం ద్వారా అభివృద్ధి జరగలేదు. జరగదు కూడా. ఈ విషయాన్ని కొందరు గుర్తించాలి. అయినా మమ్మల్ని కూలీలు అంటే.. ఔను మేం కూలీలమే. తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేసిన కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేసిన కూలీలమే. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. కేసీఆర్ విజన్‌ను చేరుకునేందుకు కష్టపడ్డారు. అయినా..జర్నలిజం అనే పేరును అడ్డుపెట్టుకుని..జీవితమంతా ఫేక్ వార్తలు రాసే వారికి, బ్లాక్మెయిల్ వార్తలు రాసే వారికి, డబ్బుల కోసం ఏ రాతలైనా రాసే వారికి.. చేమటోడ్చి కష్టపడే కూలీ విలువ ఏం తెలుస్తుంది?
కాసులకు విలువలను అమ్ముకునే వ్యక్తికి..ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడి గొప్పతనం ఎలా అర్థమవుతుంది? ఆయన వెంట వానర సైన్యంలా నడిచే బీఆర్ఎస్ కార్యకర్తల అంకితభావం ఎలా అర్థమవుతుంది? అయినాసరే..మీ మాటలతో హేళన చేసి.. వెటకారాలతో పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ చరిత్రలో నిలిచిపోయేది ఒక్కటే. రాష్ర్టాన్ని నిర్మించింది ఎవరు? దాని కోసం కృషి చేసిన కూలీలు ఎవరు? వారిని తెలంగాణ మర్చిపోదు.
– నాయిని అనురాగ్‌రెడ్డి