అమృత్సర్: పంజాబ్‌లో పట్టపగలే భారీ లూటీ జరిగింది. జ్వలరీ అమ్మే ఓ వ్యక్తిపై కొందరు దాడి చేసి అతని నుంచి 60 లక్షలు ఖరీదు చేసే బంగారాన్ని(Gold Looted) లాక్కెళ్లారు. ఈ ఘటన అమృత్‌సర్‌లోని న్యూ ఫ్లవర్ స్కూల్ వద్ద ఇవాళ ఉదయం జరిగింది. సీ డివిజన్ పోలీసు స్టేషన్ పరిధిలో నేరం జరిగినట్లు గుర్తించారు. బాధితుడిని ముక్తియార్ సింగ్‌గా పేర్కొన్నారు. సుల్తాన్‌విండ్ ఏరియాలో అతను ఓ జ్వలరీ షోరూమ్‌ను నడిపిస్తుంటాడు. పోలీసుల కథనం ప్రకారం అటాక్ జరిగిన సమయంలో ముక్తియార్ వద్ద 425 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు.
గురువారమే షోరూమ్ నుంచి ఇంటికి బాధితుడు బంగారం తీసుకెళ్లాడు. అయితే శుక్రవారం ఉదయం 10.30 ప్రాంతంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న సమయంలో కొందరు అటాక్ చేశారు. ఓ కస్టమర్‌కు బంగారం ఇచ్చేందుకు వెళ్తున్నప్పుడు ఆ దాడి జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన దుండగులు ముక్తియార్‌పై దాడికి దిగారు. న్యూ ఫ్లవర్ స్కూల్ వద్ద బైక్‌ను కారుతో ఢీకొట్టారు. సుమారు పది మంది అతన్ని వెంటాడారు. పదునైన ఆయుధాలు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు.
బంగారంతో అక్కడ నుంచి దుండగులు పరారీ అయ్యారు. స్థానికులు బాధితుడి కుటుంబానికి సమాచారం ఇచ్చి, అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నది. అయితే కొందరు గ్యాంగ్స్టర్లు ముక్తియార్‌ను బెదిరిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. డబ్బలు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. బెదిరింపులకు పాల్పడినవాళ్లే ఆ దాడి చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.