ముంబై: మద్యం సేవించిన పొరుగు వ్యక్తితో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు కుటుంబాల వారు పదుపైన ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. (Argument Leads To 3 Deaths) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. గణపత్ పాటిల్ నగర్‌లోని మురికివాడలో షేక్, గుప్తా కుటుంబాలు చాలా కాలంగా నివసిస్తున్నాయి. 2022లో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో నాటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య శతృత్వం కొనసాగుతున్నది.
కాగా, ఆదివారం సాయత్రం 4.30 గంటల సమయంలో హమీద్ నసీరుద్దీన్ షేక్ తాగిన మత్తులో రామ్ నవీల్ గుప్తా కొబ్బరికాయల షాపు ముందు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఆ రెండు కుటుంబాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. దీంతో రామ్ నవీల్ గుప్తా, అతడి కుమారులైన అమర్ గుప్తా, అరవింద్ గుప్తా, అమిత్ గుప్తా పదునైన ఆయుధాలతో వచ్చారు. హమీద్ నసీరుద్దీన్ షేక్, అతడి కుమారులు అర్మాన్ హమీద్ షేక్, హసన్ హమీద్ షేక్‌తో గొడవపడ్డారు.
మరోవైపు ఈ ఘర్షణలో రామ్ నవీల్ గుప్తా, అతడి కుమారుడు అరవింద్ గుప్తా అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు కుమారులైన అమర్ గుప్తా, అమిత్ గుప్తా తీవ్రంగా గాయపడ్డారు. అలాగే షేక్ కుటుంబంలో హమీద్ నసీరుద్దీన్ షేక్ మరణించగా, అతడి కుమారులైన అర్మాన్, హసన్ షేక్ గాయపడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణలో మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు.