హైదరాబాద్, అక్టోబర్ 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దుబాయ్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భూగర్భంలో అండర్‌గ్రౌండ్ లూప్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేసింది. పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన బోరింగ్ కంపెనీ అమెరికా బయట చేపడుతున్న మొదటి ప్రాజెక్టు ఇదే. వచ్చే ఏడాది తొలిదశ పనులు పూర్తవనున్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
దుబాయ్ వంటి దేశాల్లో ఇసుక తుఫాన్లు ఎక్కువ. విపరీతమైన వేడి, ఉక్కబోత.. బస్సులు, రైలు ప్రయాణాలను మరింత కఠినతరం చేస్తున్నాయి. పైగా పెరిగిన జనాభాతో ట్రాఫిక్ సమస్యలు దీనికి అదనం. దీంతో భూగర్భంలో అండర్‌గ్రౌండ్ లూప్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలు గంటలో 20 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. ప్రాజెక్టు మొత్తంగా పూర్తయితే గంటకు లక్ష మంది ప్రయాణించే వెసులుబాటు కలగనున్నట్టు అధికారులు తెలిపారు.
ఎలక్ట్రిక్ ఆధారితంగా నడిచే ప్రాజెక్టు కావడంతో ఇది పర్యావరణానికి హితకారిణిగా ఉండనున్నది. కాలుష్యం సమస్య ఉండదు. ట్రాఫిక్ లేకపోవడంతో ప్రయాణ సమయం 60 నిమిషాల నుంచి 3-4 నిమిషాలకు తగ్గనున్నది. చెమట, ఉక్కబోత, ఇసుక తుఫానుల సమస్య ఉండదు. లూప్‌లో 11 స్టేషన్లు అందుబాటులో ఉండటంతో నచ్చిన స్టేషన్లో ప్రయాణికులు దిగొచ్చు. తద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.