న్యూఢిల్లీ: భారతదేశ ఆటో మొబైల్ రంగాన్ని గణనీయంగా మార్చబోయే నిర్ణయంలో భాగంగా 100 శాతం ఇథనాల్‌ను చట్టబద్ధమైన వాహన ఇంధనంగా ఉపయోగిచేందుకు అనుమతినిచ్చే నిబంధనలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేశారు. దేశవ్యాప్త రవాణా వ్యవస్థలో స్వచ్ఛమైన జీవ ఇంధనానికి వాణిజ్య పరమైన విస్తరణ, అధికారిక ప్రామాణీకరణకు చట్టబద్ధమైన మార్గాన్ని సుగమం చేస్తూ, అవసరమైన పత్రాలపై తాను సంతకం చేసినట్లు గడ్కరీ ప్రకటించారు. ‘ఈ100’గా పిలిచే స్వచ్ఛమైన ఇథనాల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఇప్పటికే 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.