న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వివాదాస్పద కంటెంట్‌కు సంబంధించి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మీడియా సంస్థల నిర్ణయాలపై యూజర్లు ఫిర్యాదు చేసేందుకు అప్పిలేట్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం ముగ్గురు సభ్యులు గల గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీలు మూడు నెలల్లో ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్లో వెల్లడించింది. నూతన నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది.
కంటెంట్‌కు సంబంధించి సోషల్‌మీడియా సంస్థల నిర్ణయాలను సమీక్షించే అధికారం అప్పిలేట్ కమిటీలకు ఉంటుంది. అయితే దీనిపై హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వం హరించే ప్రమాదం ఉన్నదని ఆరోపిస్తున్నారు. గత ఏడాది ట్విట్టర్, కేంద్రం మధ్య తీవ్ర వివాదం నడిచిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలకు నియంత్రించే ఉద్దేశంతోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నదని పేర్కొంటున్నారు. ప్యానెళ్లపై కేంద్రం నియంత్రణ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతి అప్పిలేట్ ప్యానెల్లో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరిని కేంద్రమే నియమిస్తుంది. నిబంధనల ప్రకారం ఈ ప్యానెళ్లు 30 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుంది.