Junk Food | న్యూఢిల్లీ, జూన్ 17: ఒత్తిడిలో ఉన్న సమయంలో సమోసా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తింటే ఆందోళన పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అధ్యయనంలో తేలింది. సాధారణంగా ఒత్తిడిలో ఉన్నవారు ఎక్కువ కెలోరీలున్న ఆహారం తినడానికి మొగ్గు చూపుతారు. జంతువుల్లో జరిపిన అధ్యయనం ప్రకారం.. అధికంగా కొవ్వు కలిగిన ఆహారం రెసిడెంట్ గట్ బాక్టీరియాకు అంతరాయం కలిగిస్తుంది.
మన ప్రవర్తనను మార్చి ఆందోళన పెరిగే విధంగా మెదడు రసాయనాలపై ప్రభావం చూపిస్తుంది. దీన్ని అసాధారణ చర్యగా పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ లౌరీ అభివర్ణించారు. అధిక కొవ్వున్న ఆహారం తిన్న జంతువులు బరువు పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఒత్తిడి, ఆందోళనతో సంబంధమున్న సెరోటోనిన్ ఉత్పత్తి వాటిలో ఎక్కువ కావడాన్ని పరిశీలించారు. ఇది మెదడుపై ప్రభావం చూపించొచ్చని క్రిస్టోఫర్ అంచనా వేశారు. అయితే చేపలు, ఆలీవ్ నూనె, విత్తనాలు, గింజల్లో ఉండే కొన్ని రకాల కొవ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి మెదడుకు మంచి చేస్తాయని పరిశోధకులు తెలిపారు.