Delhi Pollution | న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో శీతాకాలంలో గాలి కాలుష్యం వేధిస్తున్నది. దీంతోపాటు సూక్ష్మజీవ నాశక ఔషధాలకు లొంగకుండా, మనుగడ సాగించే సత్తాగల (యాంటీబయాటిక్-రెసిస్టెంట్) బ్యాక్టీరియా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా స్టఫిలోకోక్సి అనే బ్యాక్టీరియా వృద్ధి చెందింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ నగరంలోని వివిధ ప్రాంతాలు, మురికివాడల్లో అధ్యయనం చేసి, ఈ వివరాలను వెల్లడించారు.
ఇంటి లోపల, వెలుపల గాలిలో ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిన పరిమితుల కన్నా ఎక్కువగా ఈ బ్యాక్టీరియా కనిపించింది. శీతాకాలంలో ఇది అత్యధికంగా ఉంది. ఒక ఔషధాన్ని నిరోధించి, తట్టుకుని నిలిచే సామర్థ్యం 73 శాతం స్టఫిలోకోక్సిలో కనిపించింది. ఒకటి కన్నా ఎక్కువ ఔషధాలను నిరోధించి, మనుగడ సాగించే సామర్థ్యం 36 శాతం స్టఫిలోకోక్సి బ్యాక్టీరియాలో కనిపించింది. గాలిలోని పర్టిక్యులేట్ మ్యాటర్ ఈ బ్యాక్టీరియాకు వాహకంగా పని చేస్తున్నదని, తద్వారా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతున్నదని ఈ అధ్యయనం తెలిపింది.