టొరంటో, నవంబర్ 1: పొద్దున నిద్ర లేవగానే బ్రష్‌ను పేస్టుతో నింపేసి పండ్లను రుద్దేస్తున్నారా? ఫ్రెష్‌గా ఉండాలని స్నానం చేసేప్పుడు సబ్బు అరిగిపోయేదాకా ఒళ్లును తోమేస్తున్నారా? మీరెంత చేసినా, మిమ్మల్ని బ్యాక్టీరియా నుంచి ఆ పేస్టులు, సబ్బులు కాపాడలేవు. అవును! బ్యాక్టీరియాపై పోరాడే శక్తిని అవి కోల్పోతున్నాయి. ఫలితంగా యాంటిబయాటిక్ నిరోధకత పెరిగిపోతున్నది. సబ్బులు, పేస్టుల్లో సూక్ష్మక్రిములను చంపే ట్రైక్లోసన్ రసాయనం ఉంటుంది. ఆ రసాయనం ఇప్పుడు తన శక్తిని కోల్పోతున్నది. బ్యాక్టీరియాలు ట్రైక్లోసన్‌ను ఎదుర్కొనే శక్తిని పొంది సూపర్బగ్లా తయారవుతున్నాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తలు తేల్చారు.
ఏమిటీ ట్రైక్లోసన్?
ఈ రసాయనం యాంటిబ్యాక్టీరియల్, యాంటిబయల్ ఏజెంట్లా పనిచేస్తుంది. వాస్తవానికి ఈ రసాయనం అంత మంచిది కాదు. చిన్న డోస్‌గా వాడొచ్చు. 1960ల్లో దీన్ని కనిపెట్టినపుడు మెడికల్ కేర్ ఉత్పత్తుల్లోనే వాడాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు సబ్బులు, పేస్టులు, కిచెన్ వేర్ క్లీనర్లలోనూ వాడుతున్నారు. దీని నష్టాలను పరిశీలించిన అమెరికా ఎఫ్‌డీఏ 2016లో పాక్షిక నిషేధం విధించింది. భారత్‌లో మాత్రం ఈ రసాయనంపై ఎలాంటి నిషేధం లేదు. విచ్చలవిడి వినియోగం పెరిగి, బ్యాక్టీరియాలు నిరోధక శక్తిని సంపాదించాయి. అవి మరింత ప్రమాదకరంగా తయారై, మనిషి శరీరాన్ని గుల్ల చేస్తున్నాయి.