న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా తర్వాత ఐటీ రంగంలో పెను మార్పులు వచ్చాయి. వర్క్‌ఫ్రమ్‌హోమ్ తప్పనిసరైంది. ఉద్యోగులు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే మూన్‌లైటింగ్ (ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం), క్వైట్ క్విట్టింగ్ (పనిలో అనవసర జోక్యం చేసుకోకుండా.. తన పని ఎంతవరకో అంతే చేయ డం) వంటి కొత్త పోకడలూ చూశాం. తాజాగా ఐటీ ఇండస్ట్రీలో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే రేజ్ అప్లయింగ్. అంటే.. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ పట్ల అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు.. జాబ్ కోసం ఒకే సమయంలో అనేక కంపెనీలకు అప్లయ్ చేయడం. కెనడాకు చెందిన రెడ్వీజ్ అనే యువతి కారణంగా ఇది ప్రాచుర్యం పొందింది. ‘ప్రస్తుతం ఉద్యోగంపై చిరాకొచ్చింది. 15 కంపెనీలకు అప్లయ్ చేశా. ఇప్పుడున్న దానికంటే 25వేల డాలర్ల అధిక వేతనంతో కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. సో, కీప్ రేజ్ అప్లయింగ్’ అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియోను 20 లక్షల మందికిపైగా వీక్షించినట్టు ఫార్చూన్ మ్యాగజైన్ వెల్లడించింది. తక్కువ వేతనం, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం, ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడం కారణంగా చాలా మంది ఉద్యోగులు రేజ్ అప్లయింగ్ను అనుసరిస్తున్నారని తెలిపింది.