కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మారో మోడల్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు వారాల్లో మరణించిన మోడల్స్ సంఖ్య నాలుగుకు చేరింది. మోడల్, మేకప్ ఆర్టిస్ అయిన 18 ఏళ్ల సరస్వతి దాస్ ఆదివారం కస్బా ప్రాంతం బేడియాదంగాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. చిన్న చిన్న వెంచర్లకు మోడల్‌గా మారి పలు ఆఫర్లను అందుకున్న ఆమె శనివారం రాత్రి దుపట్టాతో ఉరివేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సరస్వతి అమ్మమ్మ తొలుత చూసి కూరగాయలు కత్తిరించే కట్టర్‌తో దుప్పట్టాను కోసి ఆమె మృతదేహాన్ని కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఆ వృద్ధురాలు తమకు చెప్పిందన్నారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం తాము ఎదురుచూస్తున్నామని అన్నారు.
కాగా, కోల్‌కతాలో ఇటీవల మరణించిన ముగ్గురు మోడల్స్‌తో సరస్వతికి ఏమైనా సంబంధం ఉందా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్న సమయంలో తల్లి, పిన్ని ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. సరస్వతి చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వీడటంతో తల్లి, పిన్ని పనులు చేస్తూ ఆమెను పెంచి పెద్ద చేశారని వివరించారు.
మరోవైపు గత బుధవారం మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన 26 ఏళ్ల మోడల్ మంజుషా నియోగి శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ రెండు సంఘటనలకు ముందు ఈ నెల 15న మోడల్, టీవీ నటి పల్లవి డే, గార్ఫా ప్రాంతంలోని అపార్ట్మెంట్లోని అద్దె ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. వీరు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానించిన పోలీసులు ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కోల్‌కతాలో మోడల్స్ వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.