భోపాల్: మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. 34ఏండ్ల వ్యక్తిని అర్ధనగ్నంగా మార్చి..చేతులు కట్టేసి..కొట్టడమేగాక, అతడి నోటితో నిందితుల బూట్లను ఎత్తించారు. రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేయగా, స్థానిక కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రెండు చేతులు కట్టేసి బాధితుడ్ని కొట్టడం, విడిచిపెట్టాలని ఎంతగా వేడుకున్నా..నిందితులు వినిపించుకోకపోవటం.. వీడియోలో కనపడింది. రెండేండ్ల క్రితం నాటి ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమంలో విడుదలైంది.
‘ఆస్తి వివాదం ఈ ఘటనకు కారణమని భావిస్తున్నాం. ప్రధాన నిందితుడు జవహర్ సింగ్ (55), అతడికి సహకరించిన మరో ఇద్దర్ని అరెస్టు చేశాం’ అని రేవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ చెప్పారు. ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన వంటిదే మధ్యప్రదేశ్లోని చాతర్పూర్లో మరోకటి చోటుచేసుకుంది. పెత్తందారీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి…దళితుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. మానవ మలమూత్రాలను తీసుకొచ్చి..దళితుడి మొహం, చొక్కాకు పూశాడు. దీనిపై కేసు నమోదైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే దీన్ని తీవ్రంగా ఖండించారు. బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకొనే ఘటనలు మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయని అన్నారు.