షియోపూర్, మే 29: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు నుంచి మరో చీతాను అడవిలోకి వదిలారు. దీంతో అడవిలోకి విడిచిన చీతాల సంఖ్య ఏడుకు చేరుకుంది. సౌతాఫ్రికా నుంచి తెచ్చిన మూడు నాలుగేండ్ల వయస్సున్న నీర్వా అనే ఆడ చీతాను కునో జాతీయ పార్కులోని పెద్ద ఎన్‌క్లోజర్ నుంచి ఆదివారం సాయంత్రం అడవిలోకి విడిచిపెట్టినట్టు పార్కు డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ వర్మ తెలిపారు. ఇప్పటివరకు ఏడు చీతాలను ఫ్రీ రేంజ్‌లోకి వదిలిపెట్టామని, ఇంకా పది చీతాలు ఎన్‌క్లోజర్లలోనే ఉన్నాయన్నారు. వీటిని కూడా ఎప్పుడు విడిచిపెట్టాలన్న విషయం కేంద్రం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ నిర్ణయిస్తుందని, ఆ కమిటీ మంగళవారం పార్కును సందర్శిస్తుందని ఆయన చెప్పారు.