India-Pakistan Tension | పాకిస్తాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌కు అన్ని రకాల పోస్టల్, పార్శిల్ సేవలను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై భూ, వాయుమార్గాల్లో ఆ దేశానికి పోస్టల్, పార్శిల్ సేవలు సాధ్యం కావని సంబంధిత వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ ఒక్కో నిర్ణయం తీసుకుటూ వస్తున్నది. ఈ క్రమంలోనే పోస్టల్, పార్శిల్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి పాల్పడింది. ఫిబ్రవరి 2019లో పుల్వామా తర్వాత కశ్మీర్లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 47 మంది సీఆర్పీఎఫ్ సైనికులు అమరులయ్యారు. తాజాగా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కీలక చర్యలు చేపడుతూ వస్తున్నది.
భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశంలో 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని తక్షణమే నిలివేశారు. అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను తక్షణమే మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ పౌరులు భారతదేశానికి ప్రయాణించకుండా నిషేధం అమలులోకి తీసుకువచ్చింది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు భారతదేశం విడిచి వెళ్లేందుకు 48 గంటల సమయం సమయం ఇచ్చింది. అదే సమయంలో ఆ దేశం వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేస్తూ.. నిందితులకు కఠిన శిక్ష విధించాల్సిందేనన్నారు. ఉగ్రదాడి ఘటన చూసిన తర్వాత నుంచి ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుందన్నారు. కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొంటుండడం, ప్రజాస్వామ్యం బలపడుతున్న క్రమంలో పర్యాటకుల రాకతో ఇక్కడి ప్రజల ఆదాయం పెరుగుతూ వస్తుంటే శత్రువులు ఓర్వలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.