Anna Hazare : ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను జనవరి 30 నుంచి నిరాహార దీక్ష (Hunger Strike) చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) ప్రకటించారు. మహారాష్ట్ర (Maharastra) లోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ప్రజా సంక్షేమానికి లోకాయుక్త చట్టం చాలా కీలకమని, పదేపదే హామీలు ఇచ్చినప్పటికీ దానిని విస్మరిస్తున్నారని, ప్రభుత్వ తీరుకు నిరసనగా తాను నిరాహార దీక్ష చేపడుతున్నానని 88 ఏళ్ల హజారే తెలిపారు. ఇప్పుడు తాను చేపట్టే నిరాహార దీక్షే తన ఆఖరి నిరసన అవుతుందేమోనని వ్యాఖ్యానించారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే 2022లో కూడా తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేశారు.
దాంతో చట్టాన్ని అమలు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. ఆ తర్వాత ఓ కమిటీ బిల్లును రూపొందించింది. ఆ బిల్లును మహారాష్ట్ర శాసనసభలోని ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపాయి. ఆ చట్టం ఇంకా క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అన్నాహజారే చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు తాను ఏడు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు చేయట్లేదో తనకు తెలియట్లేదని విమర్శించారు.