ANI | 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ పనిచేస్తున్నది. ఈ క్రమంలో మీడియా విలువలను మంటగలుపుతున్నది. సైనికుల వీరత్వాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుండగా, ఏఎన్ఐ పెద్దఎత్తున ప్రచారం చేయడం సిగ్గుచేటు.
– 2019 లో రాష్ట్రపతికి మాజీ సైనికుల లేఖ
దేశంలో ఎన్నో మీడియా సంస్థలు ఉన్నాయి. కానీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మొదలు కేంద్రమంత్రుల వరకు ఏఎన్ఐకి మాత్రమే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తారు. బీజేపీకి బాకా ఊదుతున్నందుకే.. ఇలా చేస్తున్నారా?
– వివిధ సందర్భాల్లో విపక్షాల ఆరోపణలు
ఇప్పుడు అదే నిజమని తేలింది. ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) కల్పిత వార్తలను వండి వారుస్తున్నదని ఆధారాలతో సహా బయటపడింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బాకా ఊదే న్యూస్ ఏజెన్సీగా ప్రతిపక్షాలు పిలిచే ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్నట్టు యురోపియన్ నాన్-ప్రాఫిట్ గ్రూప్ ఈయూ డిస్ఇన్ఫో ల్యాబ్ తెలిపింది. మేధోసంస్థలు, ప్రముఖ జర్నలిస్టులు పేర్కొన్నట్టు అంటూ ఏఎన్ఐ పలు సందర్భాల్లో ప్రచురించిన వార్తలు అబద్ధమని, ఆ ఏజెన్సీ పేర్కొనే మేధోసంస్థలు, జర్నలిస్టులు అసలు ఉనికిలోనే లేవని వెల్లడించింది.
ఈ మేరకు ‘బ్యాడ్ సోర్సెస్: హౌ ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కోటెడ్ సోర్సెస్ దట్ డునాట్ ఎగ్జిస్ట్’ పేరిట ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఏఎన్ఐతో పాటు ఏఎన్ఐ వార్తలను అలాగే అచ్చువేస్తున్న పలు ఇండియన్ మీడియా సంస్థలను సంప్రదించగా ఎలాంటి సమాధానం రాలేదని వెల్లడించింది. పెగాసస్, ‘టీమ్ జార్జ్’ వంటి స్పైవేర్ ఉదంతాల గుట్టు రట్టు చేసిన ఫ్రాన్స్‌కి చెందిన ఫర్బిడెన్ స్టోరీస్.. ఈయూ డిస్ఇన్ఫో ల్యాబ్ పరిశోధనకు సహకారం అందించింది. కాగా, ఏఎన్ఐ స్టోరీలను దేశంలోని పలు వార్తా సంస్థలు ముందూవెనుక విశ్లేషించుకోకుండానే అలాగే అచ్చేస్తున్నాయని, దేశంలో ఫేక్ న్యూస్ వ్యాప్తికి ఇదీ ఒక కారణమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏఎన్ఐ ఫేక్ స్టోరీలు బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.
2021 మే నుంచి 2023 జనవరి వరకూ కెనడాకు చెందిన మేధో సంస్థ ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్స్ అండ్ సెక్యూరిటీ(ఐఎఫ్ఎఫ్ఆర్ఏఎస్) పేర్కొన్నట్టు, ఏఎన్ఐ 200కు పైగా వార్తలు, ప్రత్యేక వ్యాసాలు ప్రచురించినట్టు డిస్ఇన్ఫో ల్యాబ్ తెలిపింది. నిజానికి 2014లోనే ఐఎఫ్ఎఫ్ఆర్ఏఎస్ను మూసేసినట్టు వెల్లడించింది. అయితే ఢిల్లీ కేంద్రంగా ఏఎన్ఐకి అనుబంధంగా పనిచేస్తున్న శ్రీవాస్తవ గ్రూప్ ఐఎఫ్ఎఫ్ఆర్ఏఎస్ వెబ్‌సైట్‌ను అప్పటినుంచి ఆపరేట్ చేస్తున్నట్టు తెలిపింది. ఐపీ అడ్రస్ లొకేషన్‌ను ట్రాక్ చేసి దీన్ని కనుగొన్నట్టు వెల్లడించింది. అంటే, తమకు అనుకూలమైన వార్తలను సృష్టించడానికి ఏఎన్ఐ ఐఎఫ్ఎఫ్ఆర్ఏఎస్ను ఒక సోర్స్ పేరుతో వాడుకొన్నట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్ ఆర్మీ, చైనా విదేశాంగ విధానం విషయంలో ఏఎన్ఐ తరుచూ కోట్ చేసే మేధోసంస్థ ‘పాలసీ రిసెర్చ్ గ్రూప్ (పీవోఆర్ఈజీ)’కు చెందిన జేమ్స్ డగ్లస్ క్రిక్టన్, మగడ్ లిపాన్, వ్యాలెంటిన్ పోపెక్ వంటి జర్నలిస్టులు అసలు ఉనికిలోనే లేరని డిస్ఇన్ఫో ల్యాబ్ తెలిపింది. ఏఎన్ఐ పేర్కొనే సెంటర్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఫారెన్ ఎఫైర్స్ (సీపీఎఫ్ఏ) మేధోసంస్థ ఉన్నప్పటికీ, వాళ్లు ఇవ్వని రిపోర్టులను కూడా ఇచ్చినట్టు ఏఎన్ఐ కల్పిత వార్తలను వండినట్టు పేర్కొన్నది.
ఏషియా ఫిల్మ్స్ ల్యాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 1971లో ప్రారంభమై, అనంతరం 1990లో ఏఎన్ఐగా రూపాంతరం చెందింది. 2022 డిసెంబర్ వరకు ఈ ఏజెన్సీలో రాయిటర్స్‌కు 49 శాతం వాటా ఉండేది. అయితే ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం రాయిటర్స్ ఆ వాటాను ఆ తర్వాత తగ్గించుకొన్నది. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఏఎన్ఐ బీజేపీకి అనుకూల వార్తలు ప్రసారం చేసిందని, దీనికోసం ఏఎన్ఐ పలు ఫేక్ ఆర్టికల్స్ సృష్టించిందని మీడియా పరిశోధన సంస్థలు క్యారవాన్, న్యూస్‌లాండ్రీ గతంలో పలుమార్లు ఆరోపించాయి. ఏఎన్ఐ వార్తల విశ్వసనీయతపై ఈయూ డిస్ఇన్ఫో ల్యాబ్ గతంలో రెండుసార్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ నివేదికను ప్రచురించింది. కాగా, ఏఎన్ఐ వార్తా ఏజెన్సీకి మాత్రమే ప్రధాని మోదీ, అమిత్ షా ఎప్పుడూ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం పలుమార్లు వివాదమైన విషయం తెలిసిందే.ఏఎన్ఐ వార్తలను ఉన్నది ఉన్నట్టు ప్రచురించే కొన్ని ప్రధాన మీడియా సంస్థలు ప్రింట్, బిజినెస్ స్టాండర్డ్, న్యూస్18, సీఎన్ఎన్, రిపబ్లిక్ టీవీ, ఇండియాటుడే గ్రూప్, ఏబీపీ గ్రూప్, టైమ్స్ గ్రూప్, జీ గ్రూప్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, ఎన్డీటీవీ, క్వింట్, స్క్రోల్, ఫస్ట్‌పోస్ట్, లైవ్‌మింట్, హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్, హిందూ, డెక్కన్ హెరాల్డ్, టెలిగ్రాఫ్, డీఎన్ఏ, ట్రిబ్యూన్, జాగరన్, దైనిక్ భాస్కర్, అమర్ఉజాలా, నవ్‌భారత్ టైమ్స్ తదితర మీడియా సంస్థలు.
ప్రింట్, బిజినెస్ స్టాండర్డ్, న్యూస్18, సీఎన్ఎన్, రిపబ్లిక్ టీవీ, ఇండియాటుడే గ్రూప్, ఏబీపీ గ్రూప్, టైమ్స్ గ్రూప్, జీ గ్రూప్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, ఎన్డీటీవీ, క్వింట్, స్క్రోల్, ఫస్ట్‌పోస్ట్, లైవ్‌మింట్, హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్, హిందూ, డెక్కన్ హెరాల్డ్, టెలిగ్రాఫ్, డీఎన్ఏ, ట్రిబ్యూన్, జాగరన్, దైనిక్ భాస్కర్, అమర్ఉజాలా, నవ్‌భారత్ టైమ్స్ తదితర మీడియా సంస్థలు