బెంగళూరు: పెళ్లి మధ్యవర్తి కుదిర్చిన వివాహం విఫలమైంది. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి పెళ్లి బ్రోకర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Stabs Matchmaker To Death) ఆ పెళ్లి మధ్యవర్తి ఇద్దరు కుమారులు కూడా కత్తి దాడిలో గాయపడ్డారు. కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వామంజూర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల సులేమాన్ పెళ్లి సంబంధాలు చూసే మధ్యవర్తి. తన బంధువైన 30 ఏళ్ల ముస్తఫాకు షహీనాజ్ అనే మహిళతో పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఎనిమిది నెలల కిందట వారిద్దరికి పెళ్లి జరిగింది.
కాగా, పెళ్లైన రెండు నెలలకే ముస్తఫా పెళ్లి పెటాకులైంది. భార్య షహీనాజ్ అతడ్ని వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో వివాహం విఫలం కావడంపై పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి సులేమాన్‌పై ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
మరోవైపు మే 21న రాత్రి వేళ సులేమాన్‌కు ముస్తఫా ఫోన్ చేశాడు. అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో సులేమాన్ తన ఇద్దరు కుమారులు రియాబ్, సియాబ్‌తో కలిసి వాలాచిల్లోని ముస్తఫా ఇంటికి చేరుకున్నాడు. కుమారులు బయట వేచి ఉండగా సులేమాన్ ఇంట్లోకి వెళ్లి ముస్తఫాతో మాట్లాడాడు. అతడు ఎంతకీ వినకపోవడంతో తిరిగి వెళ్లేందుకు బయటకు వచ్చాడు.
కాగా, ముస్తఫా పరుగున ఇంటి బయటకు వచ్చి సులేమాన్‌ను బెదిరించాడు. వెంటతెచ్చిన కత్తితో అతడి మెడపై పొడవటంతో అక్కడికక్కడే మరణించాడు. అతడి ఇద్దరు కుమారులపై కూడా ముస్తఫా కత్తితో దాడి చేశాడు. సియాబ్ ఛాతిపై, రియాబ్ చేతిపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడు ముస్తఫాను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.