Bengaluru Metro | బెంగళూరు, ఫిబ్రవరి 11: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ మెట్రో రైలు చార్జీలను పెంచడం పట్ల పౌరులు భగ్గుమంటున్నారు. నమ్మా మెట్రో చార్జీలను 50 శాతం పెంచుతున్నట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) ఇటీవల ప్రకటించింది. దీనిపై పలు వర్గాలు మండిపడుతున్నాయి. ఈ చార్జీల పెంపుతో బెంగళూరు దేశంలోనే అత్యధిక చార్జీలు విధించిన మెట్రోగా నిలిచిందని వారు విమర్శించారు. అసలు 50 శాతం ధరల పెంపు ఎంతమాత్రం సహేతుకం కాదని, ఇది చాలా అన్యాయంగా ఉందని పేర్కొంటూ బెంగళూరు వాసులు మెట్రోను బహిష్కరించాలంటూ పలువురు పిలుపునిచ్చారు.
ఎక్స్‌లో బాయ్‌కాట్ మెట్రో అన్నది ట్రెండింగ్‌లో నిలిచింది. మెట్రో చార్జీలపై 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఇటీవల బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు చార్జీలు, ఇప్పుడు మెట్రో చార్జీలు పెంచాయి. దీంతో రవాణా భారం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయ ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అసలే ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే బెంగళూరులో ఇది మరింత సమస్యగా మారింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎంతో రద్దీగా ఉండే అమీర్‌పేట మెట్రో రైల్వేస్టేషన్‌ను బీఎంఆర్సీఎల్ అధికారులు ఒకసారి పరిశీలించాలని కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్‌లో కోరారు. స్టేషన్లో ఖాళీ ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు అద్దెకిచ్చి మెట్రో ఎంతో మొత్తాన్ని ఆదాయంగా పొందుతుందని, బెంగళూరు అధికారులు దానిని పరిశీలించి ఇక్కడ కూడా అమలు చేస్తే ప్రయాణికుల టికెట్లపై అదనపు బాదుడును తగ్గించవచ్చునని ఆయన సూచించారు.