న్యూఢిల్లీ, మే 22: రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో పుట్టుకు వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి వస్తున్న ఆదరణను చూసి దేశంలోని పలు పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఇటీవల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన ఈ పార్టీని ఇప్పటికే లక్షలాది మంది అనుసరిస్తున్నారు. సీజేపీకి పెరుగుతున్న ఆదరణకు బ్రేక్ వేయడానికి తాజాగా ‘హిట్ జనతా పార్టీ’ పేరుతో డిజిటల్ వేదికపైకి ట్రోలింగ్ మొదలైంది. బొద్దింకలను చంపే ప్రసిద్ధ బ్రాండ్ ‘హిట్’ స్ప్రే పేరుని ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో దీని పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఈ పోస్టర్లో హిట్ స్ప్రే రసాయనం ధాటికి ఒక బొద్దింక గిలగిలా కొట్టుకుని చచ్చి పడిపోయినట్టుగా చూపించారు. పోస్టర్‌పై ‘హిట్ జనతా పార్టీ’ అని రాసి, కింద త్రివర్ణ పతాక రంగుల సర్కిల్లో ‘స్వచ్ఛ్ ఘర్, సురక్షిత భారత్’ అనే నినాదాన్ని జోడించారు. కాక్రోచ్ జనతా పార్టీకి చెక్ పెట్టడానికి, ఈ ట్రెండ్‌ను మరింత హాస్యాస్పదంగా మార్చడానికి కొందరు హిట్ జనతా పార్టీతో అక్కసు వెళ్లగక్కుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ అక్కసు వెనుక అధికార బీజేపీ పార్టీ హస్తం ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై ఆ పార్టీ వారు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందిన వ్యంగ్య వేదిక ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ) ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. వైరల్ అవుతున్న ఈ ట్రెండ్‌ను గమనించి, యువతను తమవైపు తిప్పుకొనేందుకు ప్రతిపక్షపార్టీలు కృషి చేయాలని సూచిస్తూ, ఇది ప్రతిపక్షాలు తప్పక ఉపయోగించుకోవాల్సిన అవకాశం’ అని శశి థరూర్ ‘ఎక్స్’లో రాశారు. సీజేపీ ఖాతాను బ్లాక్ చేయడం తీరని నష్టం, తీవ్ర అవివేకం అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని యువత తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఒక వేదిక ఉండాలని థరూర్ అన్నారు.
కేవలం ఐదు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల కంటే ఎక్కువ(ప్రస్తుతం 19 మిలియన్లు దాటింది) ఫాలోవర్లను సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అసాధారణ వృద్ధి తనను ఎంతగానే ఆకర్షించిందని థరూర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘యువత ఎదుర్కొంటున్న నిరాశా, నిస్పృహలను నేను అర్థం చేసుకోగలను. వారు ఈ వేదికతో ఎందుకు కనెక్ట్ అవుతున్నారో కూడా నాకు తెలుసు. అందుకే ‘ఎక్స్’లో ఈ ఖాతాను నిలిపివేయడం తప్పు. యువత తమ భావాలను పంచుకోవడానికి ఒక వేదిక అవసరం. అందుకే సీజేపీ ఖాతాను మూసివేయకుండా, దానిని యథావిధిగా నడవనివ్వండని కోరారు.
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. భారత్‌లో సీజేపీ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేసిన మర్నాడే ఆయన ఈ బెదిరింపు సందేశాలు వచ్చాయి. వాటిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. బోస్టన్‌లో ఉంటున్న దిప్కేకు వచ్చిన ఒక సందేశంలో సీజేపీ ఖాతాను మూసివేయడానికి డబ్బు ఇస్తామని, లేని పక్షంలో అమెరికాలోనే అతనిని చంపేస్తామని బెదిరించారు. మరో మెసేజ్‌లో తనకు దిప్కే నంబర్ దొరికిందని, అతని ఇల్లు ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ఎక్కువ సమయం పట్టదని హెచ్చరించారు. ఈ పరిణామాల తరువాత దిప్కే ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరుతో మరొక హ్యాండిల్‌ను ప్రారంభించగా, దానికి 1.62 లక్షలకు పైగా ఫాలోవర్లు వచ్చారు.
బొద్దింకలను నిర్మూలించడం చాలా కష్టం. అవి వేగంగా వృద్ధి చెందుతాయి. వ్యంగ్యంగా ప్రారంభమైన ఒక ఉద్యమం విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. సోషల్ మీడియా వేదికలపై భారతదేశపు బొద్దింకల జనతా పార్టీ(కాక్రోచ్ జనతా పార్టీ) అనూహ్యంగా విజృంభించడం పాకిస్థాన్‌లో అనేక సమూహాలకు స్ఫూర్తినిచ్చింది. ఆ సమూహాలలో కాక్రోచ్ అవామీ పార్టీ(సీఏపీ), కాక్రోచ్ అవామీ లీగ్(సీఏఎల్) ఉన్నాయి. కాక్రోచ్ అవామీ పార్టీ పేరిట ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రారంభమైంది. ఇది తన బయోలో అవును కాపీ చేశాం. కానీ, ఎవరికీ అభ్యంతరం లేదు. నినాదం ఒక్కటే అని పేర్కొంటూ భారత ఉద్యమం నుంచి ప్రేరణ పొందినట్లు బహిరంగంగా ఒప్పుకొన్నది. ప్రస్తుతం ఆ ఖాతా 1,600 మంది ఫాలోవర్లను దాటింది.