BJP | న్యూఢిల్లీ/పాట్నా, జూన్ 24: బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఇంధన ధరల పెంపు, ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరల పెరుగుదల, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, తదితర అంశాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఈసారి కమలం పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తామన్న రూ.15 లక్షలు ఎక్కడికి పోయాయనే నిలదీతలు మోదీ సర్కార్‌కు ఎదురవుతున్నాయి.
మోదీ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం చాలని ప్రజలు భావిస్తున్నారని విశ్లేషకులు అంటు న్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులను వాహనంతో తొక్కించి చంపిన ఘటనను ప్రజలు మర్చిపోలేదని, బ్రిజ్‌భూషణ్ వ్యవహారం, మణిపూర్‌లో హింసాకాండ అంశాల్లో కేంద్ర నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారని విశ్లేషించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 37 శాతం ఓట్లతో 303 సీట్లు వచ్చినా, ఆ పార్టీకి వ్యతిరేకంగా 63 శాతం మంది ప్రజలు ఓటు వేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదని పాట్నా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వీకే శర్మ పేర్కొన్నారు. 2019లో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నదని, అయితే వ్యతిరేక ఓటును విపక్ష పార్టీలు చీల్చడంతోనే బీజేపీ అభ్యర్థులు గెలుపొందగలిగారని అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, బీజేపీ అభ్యర్థిపై విపక్షాల నుంచి ఉమ్మడిగా ఒకే అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఇది ఆచరణలోకి వస్తే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బేనని పేర్కొన్నారు.
ఈశాన్యంలో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ, పొరుగు రాష్ర్టాల్లో దాని పరిణామాలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతికూల అంశాలని విశ్లేషించారు. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాంలలో బీజేపీ నేతల మధ్య విభేదాలు బయటకు కనిపించనప్పటికీ, మణిపూర్, త్రిపురల్లో స్పష్టంగా బహిర్గతంగా ఉన్నాయి. మణిపూర్‌లో సీఎం బీరేన్‌సింగ్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మారారు. త్రిపురలో కీలక నేతల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.