(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): మధుమేహం బాధితులు శరీరంలోని షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం అవసరం. దీని కోసం తరుచూ సూదితో గుచ్చుకొని శరీరాన్ని గాయపర్చుకోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఇలాంటి బాధలేకుండా సూదితో పనిలేకుండా ఈసీజీ రీడింగ్స్‌ను బట్టి శరీరంలో గ్లూకోజ్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు నిరంతరాయంగా తెలియజేసే వినూత్న పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. తైవాన్ ఇన్నోటెక్ ఎక్స్పో-2024లో ఈ పరికరాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. ఈ డివైజ్ అందించే ఈసీజీ రీడింగ్స్‌ను బట్టి నిరంతరాయంగా షుగర్ లెవల్స్‌లో మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు.
గ్లూకోజ్‌తో పాటు ఈ రీడింగ్స్ కూడా..
ఈ డివైజ్‌లో ఉన్న ప్రత్యేక సెన్సార్ రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను నమోదు చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ డివైజ్ సాయంతో గ్లూకోజ్ లెవల్స్ మాత్రమే కాకుండా రక్తపోటు, గుండెకొట్టుకొనే వేగం, శ్వాసతీసుకొనే వేగం, శరీర ఉష్ణోగ్రతల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.