న్యూఢిల్లీ, ఆగస్టు 22 : విపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి కారణంగా దేశంలో నక్సలిజం బలపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. సల్వాజుడుం కేసులో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇవ్వకపోయి ఉంటే 2020 కన్నా ముందుగానే దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతమొందించి ఉండేవారమని పేర్కొన్నారు. మలయాళం పత్రిక మనోరమ న్యూస్ కాన్క్లేవ్ను ప్రారంభించిన సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసుకోవడంతోనే కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మరింత దిగజారాయని అన్నారు. ‘సుదర్శన్‌రెడ్డి అనే వ్యక్తి నక్సలిజానికి సాయం చేశారు.
ఆయన సల్వా జుడుం తీర్పునిచ్చారు. సల్వా జుడుం తీర్పు ఇవ్వకపోయి ఉంటే నక్సల్స్ ఉగ్రవాదం 2020నాటికే అంతమై ఉండేది. నక్సల్స్ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందినందునే ఆయన సల్వాజుడుం తీర్పునిచ్చారు’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు. మావోయిస్టులపై పోరాటంలో భాగంగా గిరిజన యువతను కోయ కమాండోలు, సల్వా జుడుం పేరిట ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించడాన్ని సుప్రీంకోర్టు 2011లో రద్దు చేసింది. ఇది చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని నాడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి తీర్పు చెప్పారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహించే వ్యక్తిని తమ అభ్యర్థిగా నిలబెట్టిందని షా ఆరోపించారు.