HD Kumaraswamy | త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కుతున్నది. అధికార బీజేపీ నేతలు తమ ప్రచారంలో సెక్యులర్ జనతాదళ్ (జేడీఎస్).. కుటుంబ పార్టీ అంటూ సెటైర్లు వేశారు. దీనిపై రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఘాటుగానే రియాక్టయ్యారు. బీజేపీ నేతలు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు వారి నాయకుడు యెడియూరప్ప వైపు చూడాలని వ్యాఖ్యానించారు.
బెంగళూర్‌లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ జేడీఎస్ ఒక కుటుంబ పార్టీ అని అని పేర్కొన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ కుటుంబం పేరు ప్రస్తావించిన అమిత్‌షా.. `ఆ కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేయని వారెవరైనా ఉన్నారా? ఆ ఇంట్లో వారంతా ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలని భావిస్తున్నారు. దేవెగౌడ ఇంటిని ఎవరు నడిపిస్తున్నారో అర్థం కావట్లేదు` అని ఎద్దేవా చేశారు.
అమిత్‌షా వ్యాఖ్యలపై కుమారస్వామి ఘాటుగానే స్పందించారు. `మా కుటుంబంపై ఆందోళన చెందుతున్న ఆయన్ను మేం సత్కరించాలి. బీఎస్ యెడియూరప్ప ఇద్దరు కొడుకుల బీజేపీలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారి కుటుంబ బాధ్యతలు ఎవరు చూస్తున్నారన్న ప్రశ్న ఒకసారి యెడియూరప్పను అడిగితే ఆయనే జవాబిస్తారేమో` అని వ్యాఖ్యానించారు.
యెడియూరప్పను వెనుక పెట్టుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఇతరులకు పాఠాలు చెబుతున్నారని కుమారస్వామి ఫైర్ అయ్యారు. జేడీఎస్‌కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్ పార్టీకే వెళుతుందని అమిత్‌షా అనడంపై కుమారస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు.