న్యూఢిల్లీ, జూన్ 19: ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లు త్వరలోనే సిగ్గుపడతారని, దేశంలో అలాంటి సమాజం ఏర్పడే రోజు దగ్గరలోనే ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషలే దేశ గుర్తింపునకు కేంద్రంగా ఉంటాయని, అందుకే ఇంగ్లిష్ కంటే వాటికే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌షా మాట్లాడుతూ ‘బ్రిటిష్ వలస పాలనలోని బానిసత్వానికి చిహ్నంగా ఇంగ్లిష్‌ను చూస్తాం. భారతీయ భాషలు మన సంస్కృతికి రత్నాల వంటివి. మన భాషలు లేకుండా మనం నిజమైన భారతీయులుగా ఉండటం మానేస్తాం. భారతదేశ భాషా వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు కృషి జరగాల్సిన అవసరముంది. మనదేశం, సంస్కృతి, మతానికి ఏ విదేశీ భాష కూడా సరితూగదు.
అసంపూర్ణమైన విదేశీ భాషలతో సంపూర్ణమైన భారతదేశం అనే భావనను ఊహించలేం. ఈ యుద్ధం ఎంత సంక్లిష్టమైందో నాకు తెలుసు. కానీ భారతీయ సమాజం విజయం సాధిస్తుందని, మరోసారి ఆత్మవిశ్వాసంతో, మనం దేశాన్ని మన భాషలతో నడిపించగలం, ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నమ్ముతున్నాను’ అని అన్నారు. నూతన విద్యా విధానం ముసుగులో త్రిభాష సూత్రం ద్వారా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని పలు రాష్ర్టాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమిత్‌షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.