న్యూఢిల్లీ: ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను (Immigration bill) లోక్సభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పర్యాటకులు లేదా విద్య, వైద్యం, వ్యాపారం కోసం భారత దేశానికి రావాలనుకునే వారిని స్వాగతించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే చొరబాటుదారులకు భారత్ ధర్మసత్రం కాదన్నారు. దేశానికి ముప్పు కలిగించే వారిపై తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
కాగా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు భారత్లోకి అక్రమంగా చొరబడుతున్నారని అమిత్ షా గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. దీంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశంలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులు పెరిగిపోయారని అన్నారు. దేశ భద్రతకు వారు ముప్పుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో అశాంతి సృష్టించే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు భారతదేశాన్ని సందర్శించే ప్రతి విదేశీయుడి గురించి దేశానికి తాజా సమాచారం అందేలా ఇమ్మిగ్రేషన్ బిల్లు నిర్ధారిస్తుందని అమిత్ షా తెలిపారు. తమ దేశం ధర్మశాల కాదన్న ఆయన, దేశాభివృద్ధికి సహకరించేందుకు ఎవరైనా భారత్కు వస్తే వారికి స్వాగతం పలుకుతామని అన్నారు. ప్రతిపాదిత చట్టం దేశ భద్రతను పటిష్టం చేస్తుందని తెలిపారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాన్ని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యం, విద్య రంగాలను ప్రోత్సహిస్తుందని అమిత్ షా వివరించారు.