
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) విచారం వ్యక్తంచేశారు. అహ్మద్‌నగర్ సివిల్ హాస్పిటల్లో అగ్నిప్రమాద ఘటనను నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని అమిత్ షా ట్వీట్ చేశారు.
అహ్మద్‌నగర్‌లోని సివిల్ ఆస్పత్రిలో ఈ ఉదయం 10.30 గంటలకు ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. 17 మంది కొవిడ్ పేషెంట్లున్న వార్డులో మంటల చెలరేగిన వెంటనే సిబ్బంది వారిని షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించారని, షిఫ్ట్ చేస్తున్న క్రమంలోనే దురదృష్టవశాత్తు 10 మంది ప్రాణాలు కోల్పోయారని అహ్మద్‌నగర్ కలెక్టర్ రాజేంద్ర భోసలే చెప్పారు. గాయపడిన ఏడుగురిలో ఒక పరిస్థితి విషమంగా ఉందన్నారు.