ఇంఫాల్: మణిపూర్లో (Manipur) ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. హింసాత్మకమైన జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక నిరసనకారుడు మరణించాడు. ఆదివారం రాత్రి పలువురు నేతల ఆస్తులు, పార్టీ కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 21 ఏళ్ల అథౌబా చనిపోయినట్లు చెప్పారు. అయితే అతడిపై ఎవరు కాల్పులు జరిపారో అన్నది పోలీసులు స్పష్టం చేయలేదు.
కాగా, నిరసనకారుల గుంపును చెదరగొట్టేందుకు పోలీస్ ప్రత్యేక కమాండోలు ఆయుధాలు ప్రయోగించినట్లు జనం ఆరోపించారు. ఈ కాల్పుల్లో అథౌబా మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారని నిరసనకారులు తెలిపారు.
మరోవైపు మహిళలు, పిల్లలను కుకీ మిలిటెంట్లు హత్య చేయడంపై మణిపూర్లో నిరసనలు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఇంఫాల్ పశ్చిమ, తూర్పు జిల్లాల్లోని యూనివర్సిటీలు, కాలేజీలతో సహా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.