డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో జూలై 7, 8 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రను (Chardham Yatra) తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. జూలై 7న భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు రుషికేశ్ దాటవద్దని, చార్ధామ్ యాత్రను ప్రారంభించవద్దని ఆయన కోరారు. ఇప్పటికే యాత్రకు వెళ్లిన వారు తమ ప్రయాణాన్ని ఆపాలని ఆయన కోరారు. వాతావరణం అనుకూలించే వరకు ఎక్కడున్న వారు అక్కడే వేచి ఉండాలని సూచించారు.
కాగా, గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. బద్రీనాథ్ వెళ్లే హైవేతోపాటు అనేక రహదారులు మూసుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లో నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ వద్ద ప్రమాదకర మార్కును దాటి అలకానంద ప్రవహిస్తోంది.