గౌహతి: అస్సాం అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. (Assam Assembly Ruckus) కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై దాడి చేసినట్లు డిప్యూటీ స్పీకర్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేతోపాటు ప్రతిపక్షం ఈ ఆరోపణలను ఖండించింది. సోమవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు హైడ్రామా జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. గత వారం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దూషించి, వారిపై భౌతిక దాడికి ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీపై చర్యల కోసం అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు.
కాగా, అసెంబ్లీలోకి వెళ్తున్న తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే నూరుల్ హుడా తనపై దాడి చేసినట్లు డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్ ఆరోపించారు. తన చేతికి రక్తం కారడాన్ని గమనించి అసెంబ్లీలోని ఫార్మసీకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ కట్టుకట్టించుకుని ఇంజెక్షన్ చేయించుకున్నానని, నొప్పికి మాత్రలు తీసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే నూరుల్ హుడా ఖండించారు. నిరసనలో భాగంగా అసెంబ్లీకి వెళ్లే దారిని మాత్రమే తమ ఎమ్మెల్యేలు బ్లాక్ చేసినట్లు చెప్పారు. డిప్యూటీ స్పీకర్‌ను తాను కొట్టలేదని అన్నారు.
కాగా, సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సభ వెలుపల జరిగినందున విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పీకర్‌ను కోరారు.
అయితే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాలని, ఈ సంఘటనపై దర్యాప్తు కోసం హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకుడు దేబాబ్రత సైకియా డిమాండ్ చేశారు. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, సీపీఎం ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన దురదృష్టకరమని స్పీకర్ అన్నారు. అసెంబ్లీ భవనంలో ఇలాంటివి అస్సలు జరుగకూడదని చెప్పారు. భవిష్యత్తులో అందరూ జాగ్రత్తగా ఉండాలని, తోటి ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలని సూచిస్తూ సభను వాయిదా వేశారు.
Assam Congress MLA Nurul Huda allegedly attacks Assembly Deputy Speaker Numal Momin amid high drama in the state assembly #Breaking pic.twitter.com/F8wqu5QFA6
— Megha Prasad (@MeghaSPrasad) March 24, 2025